*వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్లు, మౌళిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు*
సూర్య, ఖమ్మం, ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని 15 వ డివిజన్ వెలుగుమట్ల లో వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు మౌళిక సదుపాయాల కల్పన పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూదాన్ భూమిలో నిరుపేదలకు 310 ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. గతంలో వెలుగుమట్ల ప్రాంతంలో కూలీ నాలీ చేసుకుంటూ జీవించే వేలాది మంది పేద ప్రజలను కొందరు వ్యక్తులు, సంఘాల పేరుతో మోసగించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. డూప్లికేట్ పట్టాలు ఇచ్చి, పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు దౌర్జన్యం, బలప్రయోగంతో ఇబ్బందులకు గురిచేసిన అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు. డూప్లికేట్ పట్టాలు ఇచ్చిన సంఘాలు కోర్టుకు వెళ్లినప్పుడు, హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ భూదాన్ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, నిజమైన నిరుపేదలకు సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చిందని మంత్రి అన్నారు. ఆ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అప్పట్లో అక్కడ నివసిస్తున్న నిజమైన నిరుపేదల పేరిట భూదాన్ భూమిలో 310 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన సుమారు 10 శాతం పనులు మరో వారం నుంచి పది రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. కాలనీలో మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, పార్క్, డ్రెయిన్స్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఇండ్లు, సదుపాయాలను ప్రారంభించాలని భావిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ సమ్మిట్ చివరి రోజు కార్యక్రమం ఉన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి తో సంప్రదించి వారు ఇచ్చే తేదీకి అనుగుణంగా పనులన్నీ పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్, హౌసింగ్, మున్సిపల్ కార్పొరేషన్, వివిధ శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నారని అన్నారు. అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించి నిజమైన నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి కె. శ్రీరామ్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయ చంద్ర, నగరపాలక సంస్థ డిఈ నవ్యజ్యోతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్య ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ