కమెడియన్ సుధాకర్ నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి అసలు కారణం ఇదే: తనయుడు మైఖేల్ బెన్నీ ఆసక్తికర వెల్లడి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు, తమిళ చిత్రసీమల్లో హీరోగా, విలన్‌గా, స్టార్ కమెడియన్‌గా వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సుధాకర్ అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుమారుడు మైఖేల్ బెన్నీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురై నెల రోజుల పాటు కోమాలోకి వెళ్లడానికి గల అసలు కారణాలను భావోద్వేగంతో వెల్లడించారు. ఒకప్పుడు ఏ కమెడియన్‌కూ సాధ్యం కాని స్థాయిలో స్టార్‌డమ్, బిజీ షెడ్యూల్ చూసిన సుధాకర్ జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
సుధాకర్ కెరీర్ ఆరంభంలో హీరోగా రాణించి, ఆ తర్వాత కమెడియన్‌గా మారాక అవకాశాలకు గానీ, ఆర్థికంగా గానీ ఎప్పుడూ లోటు రాలేదని మైఖేల్ బెన్నీ వివరించారు. అయితే 2003, 2004 ప్రాంతంలో విడుదలైన ‘స౦క్రాంతి’ సినిమా తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని తెలిపారు. ఆ సమయంలో అవకాశాలు తగ్గడంతో సుధాకర్ తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌కు లోనయ్యారని, దానికి తోడు మధుమేహం స్థాయిలు అసాధారణంగా పెరగడంతో మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని చెప్పారు.
తన తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో దాదాపు నెల రోజుల పాటు కోమాలో ఉన్నప్పుడు తాను పదో తరగతి చదువుతున్నానని, ఆ పరిస్థితి తీవ్రతను కుటుంబ సభ్యులు తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని మైఖేల్ గుర్తుచేసుకున్నారు. ఆ కష్టకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తమ కుటుంబానికి అద్భుతమైన మద్దతు లభించిందని తెలిపారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఆసుపత్రికి, ఇంటికి వచ్చి ఎంతో సమయం గడిపి ధైర్యం చెప్పారని కృతజ్ఞతతో పేర్కొన్నారు.
అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ రోజుల్లో చిరంజీవి, సుధాకర్ రూమ్మేట్స్‌గా ఉన్నప్పుడు పనులను పంచుకుంటూ చిరంజీవి కూర వండితే సుధాకర్ అన్నం వండేవారని తన తండ్రి ఎప్పుడూ చెబుతుంటారని మైఖేల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక తన సినీ ఆసక్తుల గురించి మాట్లాడుతూ, తన తండ్రి నటించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’, ‘పెద్దరికం’, ‘ఖుషి’ చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో రెండు వెబ్ సిరీస్‌లు రూపొందించిన తాను, దర్శకుడు వివేక్ ఆత్రేయ శైలిని, నటులు నివేదా థామస్, రామ్ నటనను ఇష్టపడతానని, చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానినని మైఖేల్ బెన్నీ వివరించారు.
Also Read: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘రాతిరి’: ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి ఎపిసోడ్ విశేషాలివే