గ్రామపంచాయతీ ఎన్నికల కు పటిష్ట బందోబస్తు
సూర్య న్యూస్ దర్శి.
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట పోలీసు బందోబస్తు .
దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో 123 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట పోలీస్ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారానికి ముగింపు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
ప్రకాశం జిల్లాలో 29 వ తేదీన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు శుక్రవారం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు తెలిపారు.
ఈ నెల 29న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దర్శి,ముండ్లమూరు,తాళ్లూరు,కురిచేడు,దొనకొండ,అద్దంకి, జె.పంగులూరు,కొరిశపాడు, సంతమాగులూరు మరియు బల్లికురవ 10 మండలాల పరిధిలో మొత్తం 198 గ్రామ పంచాయతీలకు గాను 75 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 123 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఏకగ్రీవం అయిన పంచాయితీలో 45 వార్డులకు అలాగే మొత్తం 2014 వార్డులకు గాను 994 వార్డులు ఏకగ్రీవం కాగా, 1017 వార్డులకు ఎన్నికలు, మరో 3 వార్డులకు ఎన్నికలు జరగడం లేదన్నారు. 298 పోలింగ్ ప్రాంతాల్లో (హైపర్ సెన్సిటివ్ -66, సెన్సిటివ్ -71,నార్మల్ -161) 1282 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా 2,61,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఓటర్లు పోలింగ్ కేంద్రాల పరిసరాల నుంచి వెళ్లిపోవాలని, అక్కడ అనవసరంగా గుమిగూడడం, ఇతర ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడరాదని ఎస్పీ గారు సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత రెండవదశ ఎన్నికల సమయం ముగియడంతో ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని,ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు.ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండరాదని,ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు.
ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ సంయమనం, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలన్నారు.
ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు 163 బీఎన్‌ఎస్‌ఎస్,144 సెక్షన్ ,పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికల బందోబస్తు నిమిత్తం ఎ .యస్. పి-2, డి.యస్. పి- 6, సిఐ- 23, యస్ . ఐ 26 , సిబ్బంది మొత్తం 1006 మందిని, 68 రూట్లలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం 100,200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేస్తారు.
ఎన్నికల సమయంలో అత్యవసర సమాచారం లేదా పోలీసు సహాయం అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్ 112, పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 ద్వారా సంప్రదించాలని ఎస్పీ సూచించారు.