telangana
వెంకటాపూర్‌లో పశువైద్య శిబిరం - 62 పశువులకు వైద్య సేవలు
సూర్య, మందమర్రి: పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తిని పెంపొందించి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో పశువుల గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, గర్భధారణ శిబిరాన్ని నిర్వహించారు. పశువుల గర్భకోశ వ్యాధుల గుర్తింపు, గర్భధారణ సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు అందించారు. ఈ శిబిరంలో 12 ఆవులు, 50 గేదెలకు గర్భకోశ సంబంధిత వ్యాధులను గుర్తించి వైద్యం చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా 35 దూడలకు, 20 ఆవు లేగలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. పశువుల పెంపకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వైద్యులు పరిశీలించి తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన సీడీఓ ఆదిలాబాద్ డాక్టర్ దుర్గం రాథోడ్ పశుపోషణలో ఆధునిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం, పరిశుభ్రత పాటించడం, సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడం, గర్భధారణ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వంటి అంశాలను వివరించారు. పాల దిగుబడి పెరగాలంటే పశువుల ఆరోగ్యంతో పాటు వాటి పోషణ, సంరక్షణపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. పశువులకు వ్యాధులు సోకిన తర్వాత చికిత్స చేయించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ అందిస్తున్న వైద్య సేవలను రైతులు వినియోగించుకుని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ తిరుపతి, పశువైద్య సహాయకులు పి. శ్రావణ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ ఎ. రవి, గోపాలమిత్రులు రమేష్, శ్రీనివాస్, ఎం. రాయమల్లు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.