ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలిః హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్య తెలంగాణ బ్యూరో ప్రతనిధి: తెలంగాణ ప్రజలకు దశాబ్దాలుగా వైద్య సేవలందిస్తున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం గోషామహల్లో పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉండగా, కొన్ని పనుల్లో జాప్యం కనిపిస్తోందని పేర్కొంటూ, ఇకపై ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హుసేన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మెట్టు సాయి కుమార్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రూ.2,700 కోట్లతో 2,000 పడకల ఆస్పత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు సుమారు రూ.2,700 కోట్ల వ్యయంతో, 2,000 పడకల సామర్థ్యంతో నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుమారు 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి, భవిష్యత్ తరాలకు ఆధునిక వైద్య సేవలను అందించేలా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్య సదుపాయాలతో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
ఆస్పత్రి మోడల్ డిజైన్ల పరిశీలన
నిర్మాణ ప్రాంతంలో పలు బ్లాకులను సందర్శించిన మంత్రి, ఆస్పత్రి మోడల్ డిజైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎంత పని మిగిలి ఉందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, పనుల వేగాన్ని పెంచి నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మాణం
నూతన ఆస్పత్రి ప్రాంగణంలో 2,000 పడకల వైద్యశాలతో పాటు విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టళ్లు, ధర్మశాల, పరిపాలనా భవనం, పచ్చదనం పెంపునకు గ్రీనరీ, అత్యాధునిక వెంటిలేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్య విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే పైలింగ్ పనులు పూర్తయ్యాయని, రెండు అంతస్తుల స్లాబుల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, రోడ్డు కనెక్టివిటీ, పక్కనే ఉన్న హాస్టల్కు సంబంధించిన హెరిటేజ్ అంశాలు, న్యాయపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అంశాల కారణంగా నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆస్పత్రి ప్రాజెక్టులో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), వర్షపు నీటి సంరక్షణ కోసం వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రతి నెలా నిర్మాణ పనులపై సమీక్ష
ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పనుల వేగం, నాణ్యత, పురోగతిని పరిశీలించేందుకు అధికారులతో కలిసి ప్రతి నెలా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతన ఆస్పత్రి నిర్మాణాన్ని చేపట్టామని, పనుల్లో జాప్యాన్ని నివారించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన ఆదేశించారు.
ఎ.రవీందర్ తెలంగాణ బ్యూరో ప్రతినిధిః