ఉమ్మడి బెజ్జుర్ మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు..
• లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యకు నిరసనగా సీఎం నివాస ముట్టడి పిలుపు..
• నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు
సూర్య, బెజ్జుర్ :
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కౌటాల మండలంలో పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేశారు.
ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, లక్ష్మణ్ గౌడ్ మరణానికి నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపడుతున్నరు.
ఇదే క్రమంలో బెజ్జుర్ మండలంలోనూ తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలవారీ పెన్షన్, గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమకారుల సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, నిరసనలకు సిద్ధమైన వారిని ముందస్తుగా అరెస్టు చేయడంపై ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ కారులు.కుమ్మరి లింగయ్య, తెలంగాణ జావీద్,తదితర మలిదశ నాయకులు పాల్గొన్నారు.