andhrapradesh
కాకినాడ జిల్లాలో కూటమి, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ
కాకినాడ:కాకినాడ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచే ముమ్మరంగా సాగుతోంది. నియోజకవర్గవ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని భారీగా బారులు తీరారు.
ఈ క్రమంలో మంగితుర్తి పోలింగ్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఓటు వేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్ల వద్దకు వెళ్లి అధికార కూటమి నాయకులు నేరుగా ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేయడంపై ఇరువర్గాల నాయకులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కి ఘర్షణకు దారితీసింది.
పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గందరగోళం నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణ పడుతున్న కూటమి, వైఎస్సార్‌సీపీ వర్గాలను పోలింగ్ కేంద్రం పరిసరాల నుంచి బయటకు పంపివేశారు. ప్రస్తుతం భారీ బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.