తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అద్భుత పథకాలు : కడ్తాల్ బ్రాంచ్ మేనేజర్ సువర్చల
కడ్తాల్, రంగారెడ్డి:
సామాన్య, మధ్యతరగతి వర్గాల ఆర్థిక భద్రతే ధ్యేయంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అద్భుతమైన పొదుపు, జీవిత బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చిందని బ్యాంక్ కడ్తాల్ శాఖ మేనేజర్ ఎస్. సువర్చల తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు, కుటుంబ ఆర్థిక రక్షణ కోసం పొదుపు చేయడం ప్రతి ఒక్కరికీ అత్యంత ఆవశ్యకమని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా రూపొందించిన 'స్మార్ట్ స్కాలర్ చైల్డ్ ప్లాన్', 'స్మార్ట్ ప్లాటినా యంగ్ అచీవర్' పథకాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఖాతాదారుల ఆర్థిక స్థోమతను బట్టి కనిష్టంగా రూ. 50,000 నుండి గరిష్టంగా ఎంతైనా పొదుపు చేసుకునే సదుపాయం ఉందన్నారు. కేవలం 7 లేదా 10 సంవత్సరాల తక్కువ కాలపరిమితితో ప్రీమియం చెల్లించే ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా ఇన్సూరెన్స్ పథకాలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మేనేజర్ కోరారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద సంవత్సరానికి కేవలం రూ. 20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని, అలాగే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY) ద్వారా రూ. 2 లక్షల జీవిత బీమా లభిస్తుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మాత్రమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బ్యాంక్ అందిస్తున్న ఈ ప్రత్యేక పథకాలను లబ్ధిదారులు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని సువర్చల పిలుపునిచ్చారు.