ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు
కుటుంబ సభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి
రంగారెడ్డి,మేజర్ న్యూస్( నవంబర్ 9): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి సంబరాలు నిర్వహించారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పర్యటించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బొడిగే అనసూయ, నడిమింటి అనురాధ నివాసాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి టపాసులు కాల్చి, కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబంలో సంతోషం, వెలుగులు నిండాలన్నదే ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ (హౌసింగ్) ఎం. చైతన్య కుమార్, పీడీ హౌసింగ్ డి. చంప్లా నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.