తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్
లింగాల: మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు కనీస మరుగుదొడ్ల (పబ్లిక్ టాయిలెట్స్) సదుపాయం లేకపోవడం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటును కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భూమి సంబంధిత పనులు, వివిధ ధృవపత్రాలు మరియు ఇతర రెవెన్యూ సేవల కోసం ప్రతిరోజు వందలాది మంది ప్రజలు లింగాల తహసిల్దార్ కార్యాలయానికి వస్తుంటారనీ, వీరిలో మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగులు కూడా ఎక్కువగా ఉంటున్నారనీ అన్నారు. పనుల నిమిత్తం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో, ఆఫీసు ఆవరణలో కనీస పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనీ తెలిపారు.స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండటం అత్యవసరమన్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులను ఆదేశించి, లింగాల ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పరిశుభ్రమైన పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.