తారా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మృతి
తారా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ.. ఆసుపత్రి ఎదుట ధర్నా.
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద ఉన్న తారా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తునా ధర్నా నిర్వహించారు.ఈ విషయమై ఆదిభట్ల ఏసిపి ప్రదీప్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే..దేవరకొండ నియోజకవర్గం ముదికొండ గ్రామానికి చెందిన జరుపుల కిషన్ నాయక్ కుమారుడు జరుపుల వినుత్ (14) సంవత్సరాలు కాగా డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులతో బాధపడుతూ రెండు రోజుల క్రితం తారా ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆసుపత్రిలో సరైన వైధ్యానికి అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్లే తమ బాలుడి పరిస్థితి విషమించిందని, వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట పెద్ద స్థాయిలో ఆందోళనకు దిగారు.బాలుడి మృతికి గల కారణాలపై సంబంధిత వైద్యాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.