telangana
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
సూర్య కరీంనగర్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, భారత్ సేవా సహకార ఫోరం (BSSF) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్‌పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, నిరాధార ఆరోపణలతో వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్ఎస్ఎఫ్ కోర్ కమిటీ సభ్యుడు వేల్పుల వెంకటేష్ గురువారం కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాహుల్ దేశ్ పాండే అనే వ్యక్తి ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులు తదితర డిజిటల్ మాధ్యమాల్లో బసవరాజు శ్రీనివాస్ పేరును ప్రస్తావిస్తూ వివాదాస్పద వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేద, నిరుపేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల సంక్షేమం కోసం బసవరాజు శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వివాదాస్పద వీడియోలు, పోస్టులు, లింకులు, తేదీలతో సహా డిజిటల్ ఆధారాలను సేకరించి విచారణ చేపట్టాలని కోరారు. ఆరోపణలు రుజువైతే భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల ప్రకారం రాహుల్ దేశ్ పాండేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేల్పుల వెంకటేష్ పోలీసులను విజ్ఞప్తి చేశారు.