సూర్య కరీంనగర్ : భారత 77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు జై భీమ్, భారత్ మాతాకీ జై నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కోర్టు చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి సమగ్ర రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. యువత రాజ్యాంగ విలువలను అధ్యయనం చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నబోయిన ఓదెలు, నాగేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్లు వాసాల రమేష్, వేముల చంద్రశేఖర్, బండారి వేణు, సోమిడి వేణు, ఏపీపీ చంద్ర (టింకు), ఎన్నం ప్రకాష్, కాంపెల్లి రామన్, మాసం గణేష్, కొలిపాక శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.