రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు
సూర్య కరీంనగర్ : రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ కరీంనగర్ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నల్లాల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద ప్రజలకు ఓటు హక్కు, విద్యా హక్కు, సమానత్వం, స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కులు లభించాయని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను తొలగించాలని ప్రయత్నించే శక్తులను బహుజనులు సహించబోరని హెచ్చరించారు. కాన్షీరామ్ చూపిన మార్గంలో, మాయావతి నాయకత్వంలో బహుజనులంతా ఐక్యమై రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేస్తూ ప్రతి గ్రామం, వార్డులో అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాళి తిరుపతి, నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షుడు ఉల్లెందుల మహేష్, నాయకులు మాడుగుల అక్షిత్, అడ్లూరి ప్రణయ్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.