బీజేపీ ర్యాలీలో శనివారం అంగడిలో ఉన్నంత జనం కూడా లేరు - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
సూర్య కరీంనగర్ : రాహుల్ గాంధీ రాజకీయంగా రంగంలోకి దిగడంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని మాజీ సుడా చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీని ఎదుర్కొనేందుకే బీజేపీ దేశవ్యాప్తంగా 80 సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైందని అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి శనివారం అంగడిలో ఉన్నంత మంది కూడా హాజరుకాలేదని, అయినా భారీ సంఖ్యలో జనం వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో జనాన్ని తరలించారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అసలైన ఓటర్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ నేత యాదగిరి సునీల్ రావు పార్టీలు మారుతూ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. గతంలో బీఆర్ఎస్‌లో ఉండగా వినోద్ కుమార్‌ను స్మార్ట్ సిటీ ప్రదాతగా కొనియాడిన ఆయన, ఇప్పుడు బండి సంజయ్‌ను ప్రశంసిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ బండి సంజయ్ భుజం తట్టినంత మాత్రాన కరీంనగర్‌కు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించారా, అసంపూర్తిగా ఉన్న ఆర్ఓబీని పూర్తి చేశారా, డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించారా అని నిలదీశారు. సీసీఆర్ ఫండ్స్‌తో సైకిళ్లు, చాక్లెట్లు పంపిణీ చేస్తూ గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, కనీసం రాబోయే రెండేళ్లలోనైనా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టాలని బీజేపీ నేతలకు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎండీ తాజ్, కార్పొరేటర్ పర్వతం మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జీడీ రమేష్, ధన్నా సింగ్, ఎండీ షెహెన్ష, సాయిరాం, మాసూమ్ ఖాన్, జిలకర రమేష్, బషీర్, కీర్తి కుమార్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.