telangana
రూ.250 కోట్లతో వేగంగా 'దక్షిణ కాశీ' పునరుద్ధరణ
Telangana
25 Oct 2026
57 views
సూర్య, వేములవాడ:దక్షిణ కాశీగా భక్తుల గుండెల్లో కొలువైన వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు, భక్తులు ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన 80 అడుగుల రహదారి విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. రహదారి దీర్ఘకాలం మన్నికగా ఉండేలా సాంకేతిక ప్రమాణాల ప్రకారం, కచ్చితమైన నాణ్యతతో నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు.
- *55 శాతం పనులు పూర్తి!**
వేములవాడలో ఆధ్యాత్మిక అభివృద్ధి, పట్టణ ప్రగతి రెండూ సమాంతరంగా సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడను అద్భుతమైన టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనులు దాదాపు 55 శాతం, అన్నదాన సత్రం పనులు 50 శాతం వరకు ముగిశాయని, మిగిలిన పనులను వేగవంతం చేసేందుకు అదనంగా మరో రూ.99.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు. అన్నదాన సత్రానికి రూ.35 కోట్లు, దేవాలయ అభివృద్ధికి రూ.51 కోట్లకు పైగా నిధులు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు.
*నిర్వాసితుల త్యాగం అమూల్యం.. త్వరలోనే సుందర రహదారి*
భక్తుల, స్థానికుల రవాణా కష్టాలను తీర్చే 80 అడుగుల రహదారి నిర్మాణానికి రూ.6.5 కోట్లతో పాటు విద్యుత్ స్తంభాలు, ఆధునిక లైటింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు విప్ తెలిపారు. ఈ విస్తరణకు సంబంధించి రూ.47 కోట్లతో ప్రభుత్వం జీవో తెచ్చి మరీ పనులు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా రహదారి విస్తరణ కోసం తమ భూములు, ఆస్తులను కోల్పోయిన నిర్వాసితుల సహకారాన్ని, త్యాగాలను విప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పటిష్టమైన నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
*మూడో బ్రిడ్జిపై ప్రత్యేక నజర్.. బిల్లుల జాప్యానికి స్వస్తి*
గతంలో కేవలం శంకుస్థాపనలకే పరిమితమై, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
*బాసర టు భద్రాచలం.. దేవాలయాల పునరుద్ధరణే ధ్యేయం*
తెలంగాణ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ తెలిపారు. బాసర సరస్వతి ఆలయం నుంచి భద్రాద్రి రామాలయం వరకు వివిధ ఆలయాల విస్తరణ, జీర్ణోద్ధరణ పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, ఆత్మ కమిటీ చైర్మన్ ముసుకు ముకుంద రెడ్డి, సింగల్ విండో చైర్మన్ వకుళాభరణం శ్రీనివాస్‌లతో పాటు స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News