telangana
రవీంద్రభారతిలో ఘనంగా న్యాయవాదుల సంగీత విభావరి
ఉత్సాహంగా పాల్గొన్న న్యాయవాదులు, న్యాయమూర్తులు.. మధుర గానంతో అలరించిన న్యాయవాదులు
సోమాజిగూడ /మేజర్ న్యూస్ :నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి కళావేదికపై నిర్వహించిన న్యాయవాదుల సంగీత విభావరి కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా సాగింది. నగరంలోని వివిధ న్యాయస్థానాలకు చెందిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమలోని సంగీత ప్రతిభను చాటుకున్నారు. తమ మధురమైన గాత్రాలతో ప్రేక్షకులను అలరించి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత విభావరి కార్యక్రమానికి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. న్యాయవృత్తిలో నిరంతరం న్యాయపరమైన విధుల్లో నిమగ్నమై ఉండే న్యాయవాదులు, న్యాయమూర్తులు తమలోని కళాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం చక్కని వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు విజయసేన్ రెడ్డి, నామవరపు రాజేశ్వర్ రావు, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎం.ఎస్.జె. సాయి రమాదేవి, సీబీఐ కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు, 12వ ఎం.ఎస్.జె. అర్చన, 1వ ఎం.ఎస్.జె. జి. వేణు, సి.ఎం.ఎం. కోర్టు న్యాయమూర్తి అరుణ, 16వ ఏసీజేఎం ప్రభాకర్ హాజరయ్యారు. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ సభ్యులు కిరణ్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు భాను చంద్రిక కూడా పాల్గొని కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్‌రాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు నరేష్, సంయుక్త కార్యదర్శి టి. చంద్రశేఖర్, మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి ఎం. సంధ్యారాణి, లైబ్రరీ కార్యదర్శి ఏ. సత్యనారాయణ, కోశాధికారి విద్యాసాగర్ అక్కపాక, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాసులు, మహిళా విభాగం స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎస్. రామసుభద్ర, మహిళా ప్రతినిధి ఎం. ప్రమీల, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కుమారి కొమ్ము, సోని యారగాని, వి. క్రాంతి కుమార్, డి. నవనీత్ సింగ్, కె. రాజీవ్ ప్రసాద్, డి. నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.