పెద్దకొండూరులో ఉచిత వైద్య శిబిరం
రూ.50 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ
చౌటుప్పల్, మేజర్ న్యూస్: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సాయి యాదాద్రి వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో శనివారం పెద్దకొండూరు గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోనే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే వైద్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో సుమారు రూ.50 వేల విలువైన మందులను రోగులకు ఉచితంగా పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సాయి యాదాద్రి వృద్ధాశ్రమం నిర్వాహకులు అశోక్, వైద్యులు డాక్టర్ నరసింహతో పాటు శిబిర నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వైద్య శిబిరం ద్వారా ఎంతోమంది పేదలు, వృద్ధులకు మేలు జరిగిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సంజీవ, రమేష్, పాక నిర్మల, రమేష్ యాదవ్, ముప్పిడి స్వాతి, పరమేష్ గౌడ్, గ్రామ కార్యదర్శి శ్రీశైలం, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.