నగర శుభ్రతపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్
ఐదో రోజు బస్‌స్టాండ్‌లు, మెట్రో, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలల్లో శుభ్రత పనులు
*నగరవ్యాప్తంగా 180 ప్రజా ప్రదేశాల పరిశుభ్రత
ఒక్కరోజులో 26 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు
అన్ని సర్కిళ్లలో సమన్వయంతో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):నగరంలోని ప్రజా రద్దీ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగుతోంది. నాలుగు వారాలపాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం నగరంలోని వివిధ సర్కిళ్లు, జోన్ల పరిధిలో పారిశుధ్య సిబ్బంది విస్తృతంగా శుభ్రత పనులు చేపట్టారు. ప్రధానంగా బస్‌స్టాండ్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు
తార్నాక సర్కిల్-43 పరిధిలో తార్నాక బస్‌స్టాప్, ఆర్టీసీ ఆసుపత్రి బస్‌స్టాప్, టీఎస్‌ఆర్టీసీ ఆసుపత్రి, నామాలగుండు, చిలకలగూడ బస్‌స్టాప్‌లతో పాటు బౌద్ధనగర్ వార్డు కార్యాలయ ప్రాంగణంలో శుభ్రత పనులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో మెట్రో స్టేషన్ల కింద, బస్‌స్టాప్‌ల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ పనుల్లో డీఈఈ, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు.