జిల్లా ఆసుపత్రి మార్చురీ అపరిశుభ్రతపై ప్రభుత్వ విప్ బీర్ల ఆగ్రహం
స్ట్రెచర్ పైరక్తపు మరకలు తొలగించరా?
నిర్లక్ష్యం పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరిక
యాదాద్రి భువనగిరి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నిర్వహణ తీరుపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం స్ట్రెచర్లపై రక్తపు మరకలను శుభ్రం చేయకపోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంపై వైద్యులను నిలదీశారు. ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొమ్మలరామారం మండలం ఫకీరుగూడెం గ్రామానికి చెందిన నాగయ్య ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి మృతిచెందారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారం జిల్లా ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే మార్చురీ పరిసరాలను పరిశీలించారు. అక్కడ తీవ్ర దుర్వాసన రావడం, స్ట్రెచర్లపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించి వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో మృతుల కుటుంబ సభ్యులు ఎలా ఉండగలరని ప్రశ్నించారు. మార్చురీతోపాటు ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.