సూర్య, హుజురాబాద్:మానవ సేవయే మాధవ సేవగా భావించే వారంతా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సచిన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అన్నారు. రక్తదానంతో మరొక ప్రాణాన్ని నిలబెట్టవచ్చని, యువతి, యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టిన సచిన్ అసోసియేషన్ సభ్యులు పది మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
-- అవయవ దానంకు ముందుకు రావాలి....
మనిషి జన్మ సార్థకత రావాలంటే మరణించిన తర్వాత కూడా పది మందికి ఉపయోగపడే విధంగా అవయవ దానానికి ముందుకు రావాలని ఏసిపి మాధవి అన్నారు. గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్ మాట్లాడుతూ... మూడవసారి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న యువకుల పట్టుదలకు ఉపాధి అన్నారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ... నేత్ర, అవయవ, శరీర, చర్మ దానాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ఈ శిబిరంలో 90 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారికి బహుమతులను ఏసిపి అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టి. కరుణాకర్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రవి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరీష్, రెడ్ క్రాస్ కరీంనగర్ నాయకులు చైర్మన్ లక్ష్మణ్ రావు, రాధాకృష్ణ రెడ్డి, అన్నారెడ్డి, రాజిరెడ్డి, ముషం వెంకన్న, రాజేందర్, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.