telangana
రైల్వే వంతెన నిర్మాణం కోసం అఖిలపక్ష పోరు.. నవంబర్ 2న ఘట్‌కేసర్ బంద్‌కు పిలుపు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్ : ఘట్‌కేసర్ పట్టణంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న రైల్వే వంతెన నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నవంబర్ 2న ఘట్‌కేసర్ పట్టణ స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతు కోరుతూ శుక్రవారం వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వంతెనకు ఇరువైపులా రహదారులను విస్తరించాలని, జిల్లా బస్సులను ఘట్‌కేసర్ పట్టణం మీదుగా నడపాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణిని కలిసి పట్టణ సమస్యలను వివరించారు. నవంబర్ 2న నిర్వహించనున్న బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, చిరు వ్యాపారులు, ఆటో, టాక్సీ కార్మికులు, పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న రైల్వే వంతెన సాధన పోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బండారి శ్రీనివాస్ గౌడ్, అబ్బసాని యాదగిరి యాదవ్, పలుగుల మాధవరెడ్డి, సారా శ్రీనివాస్ గౌడ్, మారం లక్ష్మారెడ్డి, చింతల యాదయ్య, కొమ్మిడి రాఘవరెడ్డి, బచ్చు నాగేష్ గుప్తా, అల్లు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.