పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి
సూర్య - పెద్దపల్లి: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు బి. శ్రీరాములు, జె. అరుణశ్రీలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, రవాణా, పార్కింగ్ తదితర సౌకర్యాలపై ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక సేవలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శాఖ చేపట్టాల్సిన పనులు, అంచనా వ్యయం, అవసరమైన నిధులు, సిబ్బంది, వారికి కల్పించాల్సిన వసతుల వివరాలతో సమగ్ర ప్రతిపాదనలు సోమవారం నాటికి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో గంగయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.