మేడ్చల్, మేజర్ న్యూస్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తూట్లు పొడుస్తున్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని అక్బర్జపేట్‌లో హరితహారం కింద నాటిన 150కి పైగా మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు పీకి పడేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వాటిని ధ్వంసం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మారినో బిస్కట్ కంపెనీ సమీపం నుంచి అక్బర్జపేట్ పోచమ్మ తల్లి ఆలయం వరకు సుమారు అర కిలోమీటరు మేర రహదారి వెంట నాటిన మొక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఏళ్ల తరబడి పెంచి పర్యావరణానికి ఉపయోగపడేలా చేయాల్సిన మొక్కలను ఇలా పీకి పడేయడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన చెందుతున్నారు.ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి మొక్కలను ధ్వంసం చేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజాప్రయోజనాల కోసం నాటిన మొక్కలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం బాధ్యులపై జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అంతేకాకుండా ధ్వంసమైన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హరితహారం మొక్కల విధ్వంసంపై అధికారుల విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? బాధ్యులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వీడి పచ్చదనం పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.