telangana
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య తీవ్రతను బట్టి తక్షణమే స్పందించాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అంశాలపై తమ దరఖాస్తులను అదనపు కలెక్టర్లకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్.ఎస్. చిత్రు, డీఆర్ఓ స్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.