పోమాలలో వైభవంగా 18విగ్రహాల ప్రతిష్ఠాపన
*--ముగిసిన మూడు రోజుల మహోత్సవాలు.*
*--భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం.*
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని పోమాల గ్రామంలో శ్రీ వీరన్న స్వామి దేవాలయ మహా ప్రతిష్ఠ మహోత్సవాలు మూడో రోజు అత్యంత వైభవంగా ముగిశాయి.చివరి రోజు 18విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు.వేదమంత్రోచ్ఛారణలు,మంగళ వాయిద్యాలు,భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.మూడో రోజు ఉదయం 6:45 గంటలకు శ్రవణ నక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరాంశంలో యంత్ర ప్రతిష్ఠ,ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిపించారు.ఈ సందర్భంగా శ్రీ గణపతి,శివపార్వతులు, నంది,వీరభద్ర స్వామి,కుమారస్వామి, నవగ్రహాలు,నాగదేవతలు, ధ్వజస్తంభంతో సహా మొత్తం 18 విగ్రహాలు,పవిత్ర నిర్మాణాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలను వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు.అనంతరం శాంతి హవనం,మహా పూర్ణాహుతి,మహా మంగళహారతి నిర్వహించిభక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.తదుపరి అన్నప్రసాద వితరణ చేపట్టారు.మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన మహా ప్రతిష్ఠ మహోత్సవాలు విజయవంతంగా ముగియడంతో పోమాల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఆలయంలో కొలువుదీరిన దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.శివశ్రీ వీరన్న స్వామి,ప్రభులింగం స్వామి,అభిలాష్ స్వామి,మహేష్ స్వామి,శివచరణ్ స్వామి,సదాశివ స్వాముల వైదికత్వంలో మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవిత నరేష్,ఉపసర్పంచ్ ఆంజనేయులు,ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన్ చారి,పెద్ద బుచ్చయ్య,మదన్ మోహన్ గౌడ్,నాగేష్ చారి,జగన్మోహన్ గౌడ్,రామచంద్రయ్య,ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,మహిళలు,యువకులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.