పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో
సంగారెడ్డి :; పోలీస్ ఫ్లాగ్ డే / పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు శనివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మహిళల భద్రతలో షీ టీమ్స్ పాత్ర, వివిధ రకాల సైబర్ మోసాలు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక న్యూస్ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రసారం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సైబర్ వారియర్స్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానాలను వివరించారు. మహిళలు, యువతులు వేధింపులకు గురైనప్పుడు షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని, మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న షీ సేఫ్ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివరించిన అంశాలు: ఫ్రెండ్లీ పోలీసింగ్: ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న పగలు, రాత్రి బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థల గురించి వివరించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం: నేరస్తులను గుర్తించేందుకు పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, పాపిలాన్ డివైజ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల గురించి వివరించారు.
మహిళల భద్రత: మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రం పనితీరు, వాటి సేవల గురించి అవగాహన కల్పించారు.
•సైబర్ నేరాల నివారణ: ఆన్‌లైన్‌లో అపరిచితులతో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఓటీపీ వంటి వాటిని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు శివకుమార్, సర్దార్‌తో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించారు.