పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నూతన మెనూ అమలు చేయాలి
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్‌కు హెచ్‌డబ్ల్యూఓల వినతి
మోమిన్ పేట్, మేజర్ న్యూస్: హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలకు అనుగుణంగా ప్రస్తుత మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని నూతన మెనూను రూపొందించి అమలు చేయాలని హాస్టల్ సంక్షేమ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు.తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచడంతోపాటు నూతన మెనూను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అప్పటి ధరల ఆధారంగా రూపొందించిన మెనూనే ప్రస్తుతం కొనసాగుతుండగా, నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సెంట్రలైజ్డ్ టెండర్ విధానంలో సరఫరా చేస్తున్న సరుకుల ధరలు మార్కెట్ ధరల కంటే సుమారు 52 శాతం అధికంగా ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో 2024లో రూపొందించిన మెనూను 2026 నాటి సరఫరా ధరలతో అమలు చేయడం ఆచరణ సాధ్యం కాదని తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంతోపాటు హాస్టళ్ల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక, సరఫరా సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా నూతన మెనూను రూపొందించి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా, రమేష్, హెచ్‌డబ్ల్యూఓల యూనియన్ అధ్యక్షుడు, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తుల్జారామ్ గౌడ్, బి. శుక్రవర్ధన్ రెడ్డి, కార్యదర్శి టి. విజయ్ కుమార్‌తో పాటు జిల్లాలోని హెచ్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.
రిపోర్టర్: వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.