పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో ముందుకు సాగి రైతుల శ్రేయస్సుకు పాటుపడాలి
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి…
కడ్తాల్ , రంగారెడ్డి
పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో ముందుకు సాగి రైతుల శ్రేయస్సుకు పాటుపడాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆమనగల్ పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డి శనివారం టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా, డీసీసీ ప్రధాన కార్యదర్శి చేగురి వెంకటేష్‌లతో కలిసి వంశీచంద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో పీఏసీఎస్ పాలకవర్గాల బాధ్యత కీలకమన్నారు. సకాలంలో రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి సాగులో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను రైతుల చెంతకు తీసుకుపోవాలని అన్నారు.
ఎల్ నినో నేపథ్యంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వలన రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా పీఏసీఎస్ పాలకవర్గాలు రైతులకు అవగాహన కల్పించాలని వంశీచంద్ రెడ్డి సూచించారు. పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్‌లో గుర్తింపు ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.