telangana
పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి
సూర్య, మందమర్రి : మందమర్రి–లంబాడితండా (మామిడిగూడ) మార్గంలోని పెద్దవాగుపై తక్షణమే వంతెన నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జనసేన పార్టీ నాయకుడు ఆవుల సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆవుల సాగర్ మాట్లాడుతూ.. పెద్దవాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గత పదేళ్లుగా జనసేన పార్టీ తరఫున పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసి సమస్యను దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడం బాధాకరమన్నారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిసర ప్రాంతాల్లోని నాలుగు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని, ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవాగుపై వంతెన నిర్మిస్తే చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల ఇబ్బందులను, ప్రాణభద్రతను దృష్టిలో ఉంచుకొని పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డి. భాను, ఎస్. శ్రీనివాస్, ఎం. రవి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.