ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురండి
- టిఆర్పి మండలాధ్యక్షులు దర్గా వెంకటయ్య
కొందుర్గు (రంగారెడ్డి): కొందుర్గు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావాలని టిఆర్పి మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య అధికారులను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ విషయమై అధికారులకు వినతిపత్రం అందజేశారు. రెండు మండలా లైన కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో సుమారు 70 వేల జనాభా ఉందని, రెండు మండలాలకు సంబంధించి కొందుర్గ్ మండల కేంద్రంలో మాత్రమే ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని, ఉన్న ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవని వినతిపత్రంలో పేర్కొన్నారు. అందువల్ల ఇకనైనా అధికారులు స్పందించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలను అందుబాటులోకి తీసుకురావాలని వినతి పత్రంలో కోరారు. అలాగే మండల పరిధిలోని ముట్పూర్ సర్పంచ్ కనకమామిడి అంజయ్య అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ గ్రామం నుంచి వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో ఎగ్జిట్, అండర్ పాసులు ఏర్పాటు చేయాలని ఆయన వినతిపత్రంలో కోరారు. తమ గ్రామానికి చెందిన 165 మంది రైతులకు సంబంధించిన 105 ఎకరాల భూమిని రోడ్డు నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని, రైతులు గ్రామస్తులకు మేలు జరిగే విధంగా తమ శివారు గ్రామమైన చుక్కమెట్, ముట్పూర్ శివారు దండుబాట వద్ద ఒక అండర్ పాస్, అలాగే రేగడిచిలకమర్రి బీటీ రోడ్డుకు ఒక ఎగ్జిట్, ముట్పూర్ నుంచి ఉమ్మెంత్యాల వెళ్లే రోడ్డుకు ఒక ఎగ్జిట్, రైతులు పొలాలకు వెళ్లేదారిలో మరో రెండు చోట్ల అండర్ పాస్ లను ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో సర్పంచ్ అధికారులను కోరారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.