పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డికి బీసీ నేత ఆర్.కృష్ణయ్య లేఖ
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః మియాపూర్ లోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం తగదని, ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. మియాపూర్ భూమి ప్రభుత్వ భూమిగా సుప్రీంకోర్టులో వాదించి గెలవడం హర్షించదగ్గ విషయం. భూమిని వేలం వేయడం కంటే రెండు విధాలుగా ఉపయోగించాలని ఆర్. కృష్ణయ్య సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా లేఖ రాశారు. ఇందులో 200 ఎకరాల భూమిని నిరుపేదలకు, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టి కట్టించడానికి ఉపయోగించాలి. నగరంలో 6 లక్షల కుటుంబాలకు ఒక గజం భూమి లేదు. అద్దె ఇళ్ళలో పుట్టెడు కష్టాలతో జీవిస్తున్నారు. మిగతా 300 ఎకరాల భూమిని బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లకు 100 ఎకరాల భూమి కేటాయించి, 200 ఎకరాలు గురుకులాల భవనాలకి సొంత భవనాలు నిర్మించాలి. గ్రేటర్ హైదరాబాద్ లో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు ఉండగా ఒక్కదానికి కూడా సొంత భవనాలు లేవు. వీటికి స్వంత భవనాలు నిర్మించాలి. అలాగే మిగతా 200 ఎకరాల భూమిని 70 బీసీ గురుకులాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. వీటికి ఒక్క దానికి కూడా సొంత భవనాలు లేవు. వీటికి అద్దె కింద ఏటా వందల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు.
ఈ భూమిని హాస్టళ్లు, గురుకులాలకు కేటాయిస్తే నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులు అలాగే కార్పొరేట్ సంస్థల నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించి స్వంత పక్కా భవనాలు నిర్మించాలి. ఇది చారిత్రాత్మకంగా ఉంటుందన్నారు. స్వంత భవనాలు నిర్మిస్తే సౌకర్యవంతంగా యుండి విద్యార్థులు బాగా చదివి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ఇలా నిర్మిస్తే అద్దె భవనాలకు అద్దె కింద వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించే భాద తప్పుతుందన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.