అభివృద్ధి సంక్షేమం కోసం టిడిపిని గెలిపించాలి
మక్కువ, సూర్య : అభివృద్ధి సంక్షేమ టిడిపి తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ , జడ్పిటిసి సభ్యులు గెలిపించుకోవాలని రాష్ట్ర గిరిజన , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. ఆదివారం మక్కువ మండలంలో పనసభద్ర పంచాయతీ దుగ్గేరు, మార్కొండ పుట్టి , కోన , గోపాలపురం, దెబ్బగడ్డ , తూరుమావుడి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పనసభద్ర గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మక్కువ మండలంలో కోట్ల రూపాయలు కట్ చేసి రోడ్డు నిర్మించడం జరిగిందని తెలిపారు. మరో 20 కోట్ల రూపాయలతో మక్కువ మండల అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన చేసేయమన్నారు. ఎన్నికలు అయిన వెంటనే పనులు చేపడతామని ఆమె తెలిపారు. అభివృద్ధి , సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వివరించారు. మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రస్తుత మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు ను చేసేందుకు, మండలంలో అత్యధిక శాతం ఎంపీటీసీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలో తెలుగుదేశం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముందు తీసుకువెళ్లి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో గల అన్ని గిరిజన గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి రహదారి సౌకర్యంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేపట్టిన అభివృద్ధిని చూసి జరగనున్న మండల , జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో మంత్రి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు తో పాటు ఆయా గ్రామాల టిడిపి నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.