పర్యావరణ పరిరక్షణలో చిన్నారి ప్రతిభ.. చేవెళ్ల విద్యార్థినికి ఎర్త్ లీడర్ అవార్డు!
చేవెళ్ల ఆదర్శ పాఠశాల విద్యార్థిని గడ్డమీద లక్ష్మి తేజకు అరుదైన గుర్తింపు
(రంగారెడ్డి - మేజర్ న్యూస్) : పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న చేవెళ్ల ఆదర్శ పాఠశాల విద్యార్థిని గడ్డమీద లక్ష్మి తేజకు ప్రతిష్ఠాత్మకమైన ఎర్త్ లీడర్ అవార్డు లభించింది. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ, పుడమి సంరక్షణకు కృషి చేస్తున్న ఆమె ప్రతిభకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (CGR) పర్యావరణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అన్మాస్‌పల్లిలోని ది ఎర్త్ సెంటర్‌లో నిర్వహించిన యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ (YELP) 2025–26 వార్షిక పురస్కారాల ప్రదానోత్సవంలో లక్ష్మి తేజ ఈ అవార్డును అందుకుంది.
పాఠశాల స్థాయి నుంచి చేవెళ్ల పట్టణం వరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న విశేష కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణంపై బాధ్యతను పెంపొందించడంతో పాటు ప్రకృతి సంరక్షణ దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం స్వామి శితికంఠానంద, CGR అధ్యక్షురాలు కె. లీలా లక్ష్మారెడ్డి, మాజీ సమాచార కమిషనర్ ఆర్. దిలీప్ రెడ్డి, NSE సీనియర్ మేనేజర్ కౌశల్ కిషోర్ కుమార్, SSE ప్రతినిధి వినీత్ శాస్త్రి, NABARD జనరల్ మేనేజర్ ఆర్. గణపతి, CGR సీఈఓ జి. నారాయణ రావు, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎన్. ఉపేందర్ రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త డా. ఎన్. సాయి భాస్కర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా లక్ష్మి తేజ అవార్డును అందుకుంది.
అలాగే CGR వ్యవస్థాపకుడు కె. లక్ష్మారెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మి తేజను అభినందించారు. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణకు ఆమె చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస రావు, చేవెళ్ల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అజ్రాన, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ ఇన్‌చార్జి రజనికాంత్, విద్యార్థిని తండ్రి జి. నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించి, తన కృషితో గుర్తింపు పొందిన లక్ష్మి తేజను పలువురు అభినందించారు.