పక్కదారి పట్టిస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్‌ను శాశ్వతంగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు ధీరావత్ శ్రీనునాయక్
పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న డీలర్‌పై చర్యలు తీసుకోవాలి
రేషన్ డీలర్‌ను శాశ్వతంగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌కు ధీరావత్ శ్రీనునాయక్ వినతి
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
మిర్యాలగూడకు వచ్చిన జిల్లా కలెక్టర్‌కు దామరచర్ల మండలం తేట్టకుంట గ్రామ రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధీరావత్ శ్రీనునాయక్ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న తేట్టకుంట రేషన్ డీలర్‌ను శాశ్వతంగా తొలగించాలని కోరారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన రేషన్ డీలర్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
రేషన్ బియ్యం తీసుకోవడానికి వచ్చే మహిళలు, వృద్ధుల పట్ల డీలర్ గౌరవంగా వ్యవహరించడం లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయంగా బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ, ఓటు వేయలేదనే కారణంతో బియ్యం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. డీలర్ భార్య అయినప్పటికీ, ఆమె భర్త రేషన్ పంపిణీ వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం చేస్తూ, రెండు మూడు రోజుల తర్వాత రావాలని చెప్పడం, తిరిగి వెళ్లినప్పుడు బియ్యం అయిపోయాయని చెప్పడం వంటి ఇబ్బందులకు ప్రజలను గురిచేస్తున్నారని వివరించారు. మైనర్ బాలుడిని కూడా రేషన్ పంపిణీకి వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత డీలర్‌ను శాశ్వతంగా తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే మిర్యాలగూడ ఆర్డీవోతో మాట్లాడి, ఆరోపణలపై విచారణ చేపట్టి వాస్తవాలు నిర్ధారణ అయితే డీలర్‌ను తొలగించాలని ఆదేశించినట్లు ధీరావత్ శ్రీనునాయక్ తెలిపారు.