పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా?
సంగారెడ్డి జిల్లా:పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని పది ఎకరాల హరితహారం పార్కు భూమిని పరిరక్షించాలని కోరుతూ ఇస్నాపూర్ పురపాలక సంఘం సహనియామక సభ్యుడు మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రయోజనం కోసం కేటాయించిన పార్కు భూమి ఆక్రమణలకు గురవుతోందన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు.2015లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో పది ఎకరాల భూమిని పార్కు కోసం కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా ఈ ప్రాంతంలో మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఈ భూమికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ప్రస్తుతం పార్కు కోసం కేటాయించిన భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు, అంతేకాకుండా పార్కు భూమి మీదుగా రహదారి నిర్మాణం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ అవసరాల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన భూమి విషయంలో నిర్లక్ష్యం తగదని ఆయన స్పష్టం చేశారు.
భూ రికార్డులు పరిశీలించి సంయుక్త సర్వే నిర్వహించాలి
పార్కు భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, మొత్తం విస్తీర్ణం, హద్దులు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆమోదించిన భూ వినియోగ ప్రణాళిక తదితర రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. రెవెన్యూ, పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులతో సంయుక్తంగా క్షేత్రస్థాయి భూ సర్వే నిర్వహించి అసలు పరిస్థితిని ప్రజలకు వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
పార్కు భూమిలో ఆక్రమణలు లేదా అనధికార రహదారి నిర్మాణం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్కు భూమిని తిరిగి ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
పార్కు భూమికి హద్దులు నిర్ణయించి కంచె ఏర్పాటు చేయాలి
భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు అవకాశం లేకుండా పార్కు భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ కంచె నిర్మించాలని నిజాముద్దీన్ బాబా అధికారులను కోరారు.ప్రభుత్వ భూములు, పర్యావరణ పరిరక్షణకు కేటాయించిన స్థలాలను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని, పది ఎకరాల హరితహారం పార్కు భూమి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.