BREAKING
పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: రూ. 75 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, యష్, రణ్‌బీర్ సినిమాల రికార్డులు బ్రేక్! నిఘా నీడలో హరిదాస్ నగర్ గ్రామం.. సీసీ కెమెరాలు ప్రారంభించిన డి.ఎస్.పి నాగేంద్ర చారి కుందుర్పి ఎంపీడీఓ కార్యాలయం లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. ఏపీలో 13 కేంద్రాల్లో రీపోలింగ్ మొరుసు తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి .. జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

బీజేపీ పాలకవర్గ అవినీతిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి!

Select Suryaa Now
బీజేపీ పాలకవర్గ అవినీతిపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి!

సూర్య కరీంనగర్‌: నగరపాలక సంస్థలో బీజేపీకి చెందిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా? బ్లాక్‌లిస్టులో పెడతారా? లేక నైతిక బాధ్యత వహిస్తూ మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

సోమవారం కరీంనగర్‌లోని మంకమ్మతోటలో ఉన్న మీకోసం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో గత ఎనిమిది నెలల 15 రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని అన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కీలక స్థానాల్లో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలు వస్తుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.

బండి సంజయ్‌ వ్యాఖ్యలే అనుమానాలకు తావిస్తున్నాయి!

నిన్న జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ నగరపాలక సంస్థ బీజేపీ పాలకవర్గ సభ్యులను ఉద్దేశించి ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని బ్లాక్‌లిస్టులో చేరుస్తానని వ్యాఖ్యానించడంపై చల్ల హరి శంకర్‌ ప్రశ్నలు సంధించారు. బీజేపీ పాలకవర్గ సభ్యులు అవినీతికి పాల్పడకపోతే కేంద్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు చూస్తుంటే నగరపాలక సంస్థలో బీజేపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారనే అనుమానం ప్రజల్లో కలిగే అవకాశం ఉందన్నారు. అవినీతి జరగకుంటే బ్లాక్‌లిస్టులో పెడతానని హెచ్చరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రూ.100 కోట్ల నిధులు ఏమయ్యాయి?

నగరంలో జనరల్‌ ఫండ్‌, యూఏడీఎఫ్‌ నిధులు కలిపి సుమారు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని హరి శంకర్‌ ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

పనులకు శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టడం వరకే పరిమితమవుతున్నారని, ఆ తర్వాత పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. నిధుల వినియోగం, పనుల కేటాయింపు, బిల్లుల చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టర్లను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి!

కాంట్రాక్టర్లకు పనులు కేటాయించడం, బిల్లుల చెల్లింపుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని కోరారు. కాంట్రాక్టర్లను నేరుగా పిలిచి విచారిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. పనులు పొందేందుకు కాంట్రాక్టర్లు కమీషన్లు చెల్లించాల్సి వస్తోందన్న ఆరోపణలపైనా అధికారులు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఎవరు కమీషన్లు అడుగుతున్నారు? కాంట్రాక్టుల కేటాయింపులో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి? అనే అంశాలను నిగ్గు తేల్చాలన్నారు.

నగరంలో నిర్మిస్తున్న భవనాల యజమానులను మీరు అడిగితే మీ కార్పొరేటర్ల అవినీతి చెపుతారు..!

గత ఎనిమిది నెలల 15 రోజులుగా నగరంలో జారీ చేసిన భవన నిర్మాణ అనుమతుల వివరాలను అధికారుల నుంచి సేకరించి విచారణ జరపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సూచించారు. అనుమతులు పొందినవారిని నేరుగా సంప్రదించి ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేశారా? అనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి తమ వద్ద ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని వెల్లడించారు.

మహాలక్ష్మి ఆలయంలో ప్రమాణానికి సిద్ధం

తాము చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తమ వద్ద ఆడియో, వీడియో రికార్డులతోపాటు సాక్ష్యాధారాలు ఉన్నాయని చల్ల హరి శంకర్‌ తెలిపారు. వాటిని తీసుకొని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మీడియా సమక్షంలో సాక్ష్యాలతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇందుకు బండి సంజయ్‌ సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ చేశారు. ఆరోపణలను కొట్టిపారేయడం కాకుండా విచారణకు సిద్ధపడాలని అన్నారు.

ఆధారాలు బయటపెట్టకముందే చర్యలు తీసుకోవాలి

తాము ఆధారాలు బయటపెట్టిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని హరి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే సంబంధిత కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ పరంగా బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

అవినీతి ఆధారాలు బయటపెడితే మంత్రి రాజీనామా చేయాల్సిందే!

తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టిన రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హరి శంకర్‌ హెచ్చరించారు. కార్పొరేటర్ల వ్యవహారాలపై ఇప్పుడే సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కేంద్ర మంత్రి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హితవు పలికారు. నగర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి, అవినీతి ఆరోపణలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చల్ల హరి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ తో పాటు..బిఆర్ ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనూప్ కుమార్, డివిజన్ అధ్యక్షులు ఆరె రవి, చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, రాజ్ కుమార్, బండ శ్రీకాంత్, పిట్టల శ్రీనివాస్, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కలర్ సత్తన్న, మిడిదొడ్డి నవీన్, సత్తినేని శ్రీనివాస్, నాగుల కిరణ్, సైఫ్, ఇర్ఫాన్, విజ్ఞాన్ శ్రీనివాస్, సాయి, ఆవుల శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.