andhrapradesh
అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్
అమరావతి:బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ (Murasu) తీవ్ర తుఫాను తీరం వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని తీవ్ర అప్రమత్తం చేసింది. తుఫాను తీవ్రత కారణంగా నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత, తుఫాను ప్రభావిత దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇవాళ, రేపు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అన్ని జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
కంట్రోల్ రూమ్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని అధికారులను హోంమంత్రి సూచించారు. ప్రజలకు ఎలాంటి విపత్తు సంభవించినా తక్షణ సహాయం అందేలా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందన్నారు.