ఇనుగుర్తిలో బంజర కుంట అక్రమ తవ్వకాలపై రైతుల ఆగ్రహం-.. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన..
ఇనుగుర్తి, మేజర్ న్యూస్, మండల కేంద్రంలోని బంజర కుంటలో అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో సంబంధిత వ్యక్తి రాత్రికి రాత్రే జేసీబీతో భారీ గుంతలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం బంజర కుంటలో జేసీబీ యంత్రంతో గుంతలు తీస్తుండగా గమనించిన బాధిత రైతులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అనంతరం కుంటను కాపాడాలని కోరుతూ తహశీల్దార్, స్థానిక పోలీసులు మరియు సర్పంచ్‌కు రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోకపోవడంతో సదరు వ్యక్తి మరింత బరితెగించాడు. ఆదివారం రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా లోతట్టుగా భారీ బొంద తవ్వేశాడు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రైతులకు హామీ ఇచ్చారు.
రిపోర్టర్; యాకుబ్ పాషా, ఇనుగుర్తి మహబూబాద్ బాద్ జిల్లా