ఓటు చోరీతోనే బీజేపీ అధికారం
పటాన్‌చెరు;ఓటు చోరీతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి ఆరోపించారు. దేశ ఐక్యత కోసం ఇద్దరు ప్రధానులను కోల్పోయిన రాహుల్ గాంధీ కుటుంబంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. బుధవారం పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు.అలాంటి కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ప్రధాని కాలేరంటూ అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదన్నారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ ప్రజల ప్రేమాభిమానాలను చూరగొందని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల్లో ఐక్యతా భావాన్ని పెంపొందించారని తెలిపారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న ఎన్నికల హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు.దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపు, ఓటు చోరీకి పాల్పడుతూ బీజేపీ అధికారంలోకి వస్తోందని నరసింహారెడ్డి ఆరోపించారు. దేశంలోని ఓడరేవులు, బొగ్గు గనులు, విమానాశ్రయాలు, బ్యాంకులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రజా సంపదను కొల్లగొడుతోందని విమర్శించారు. దీంతో పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని అన్నారు.వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు, యువత, కార్మికులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యువరాజ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.