ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం
సంగారెడ్డి;వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చి, బీసీలను కులాల వారీగా లెక్కించాలని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనగణనను మూకుమ్మడిగా బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనసభకు సంబంధించిన పోస్టర్‌ను సంగారెడ్డిలోని ఐబీ అతిథి గృహంలో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తాటిపల్లి పాండు మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని గత ఆరు నెలలుగా బీసీలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చించే బాధ్యతను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారిని రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 80 కోట్ల మంది బీసీలను ఏకం చేసి, తమ హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల జనసభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ధన మల్లేష్, కుర్మ సంఘం అధ్యక్షుడు మల్లన్న, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జగదీష్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గోరుగంటి రమేష్ కుమార్, వంశీ యాదవ్, ప్రభు గౌడ్, రాజు, రమేష్ కుమార్, కృష్ణ గౌడ్, అశోక్, రామ్ నారాయణ, కోవూరు శ్రీనివాస్, కుమ్మరి రమేష్, శ్యామా గౌడ్, శివశంకర్, నగేష్ కుమార్, నర్సింగరావు, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.