నిబంధనలకు తూట్లు.. బస్టాండ్, పాఠశాలల చెంతనే వైన్స్ షాప్
పెద్దశంకరంపేట;మండల కేంద్రంలో మద్యం విక్రయాలు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాప్, ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే వైన్స్ షాప్ నిర్వహిస్తుండటంతో మహిళలు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల భద్రత కంటే మద్యం వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.బస్టాప్, పాఠశాలలకు కూతవేటు దూరంలో వైన్స్.మండల కేంద్రంలో ప్రస్తుతం వైన్స్ షాప్ నిర్వహిస్తున్న ప్రదేశంలో గత 25 సంవత్సరాలుగా ఆటో స్టాండ్ కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిజాంపేట, బాచుపల్లి వైపు వెళ్లే ప్రయాణికులతో పాటు పాఠశాల విద్యార్థులు సైతం ఇదే ప్రాంతం నుంచి ఆటోలు ఎక్కి ప్రయాణించాల్సి ఉంటుంది. సమీపంలోనే బస్టాప్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉండటంతో నిత్యం మహిళలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాప్, పాఠశాలకు సుమారు 50 మీటర్ల పరిధిలోనే వైన్స్ షాప్ ఉండటంపై నిబంధనల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి దూర నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.గత ఘటనలు మరచిపోయారా గతంలో ఇదే ఆటో స్టాండ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అతిగా మద్యం సేవించి కమలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై చోరీకి యత్నించిన ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. మరో సందర్భంలో వైన్స్ షాప్ ఎదుటే అతిగా మద్యం సేవించిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అక్కడి పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు.వైన్స్ షాపులకు అనుబంధంగా కొనసాగుతున్న పర్మిట్ రూములు బార్లను తలపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. మద్యం సేవించే వారి రద్దీ, పరిసరాల్లో ఏర్పడుతున్న పరిస్థితులతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అనుమతులకు మించి కార్యకలాపాలు సాగుతున్నారు పర్మిట్ రూముల్లో నిబంధనల ప్రకారం తాగునీటీ సౌకర్యం మాత్రం కల్పించాలి.. కాని పెర్మిట్ రూమ్ లలో టేబుల్ లు చైర్స్ నాణ్యత లేని తినుబందారాలు శితల పానీయలు లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు పరిశుభ్రత, భద్రత, అనుమతుల విషయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆఫర్లతో బెల్ట్ షాపులకు ప్రోత్సాహమా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల నుంచి ఆఫర్లు, రాయితీల పేరుతో అధిక మొత్తంలో మద్యం సరఫరా చేస్తూ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది.గ్రామాల్లో యువకులు మద్యం విచ్చాలవిడిగా లభించడం తో పనులు మానేసి చిత్తుగా మద్యం సేవిస్తూ తమ భవిష్యత్తు అంధకారంలోకీ నెట్టివేసుకుంటేన్నారని వాళ్ళ తల్లితండ్రులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇళ్ల మధ్యే బెల్ట్ షాపులు.. సామాన్యులకు తిప్పలు మండల కేంద్రంలో కుటుంబాలు నివసించే ఇళ్ల మధ్యలోనే కొన్ని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాటి వద్ద మద్యం కొనుగోలు చేసే వ్యక్తులు మద్యం మత్తులో పక్కనే ఉన్న సాధారణ ప్రజల ఇళ్ల తలుపులు కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాయి. నివాస ప్రాంతాల్లో మద్యం విక్రయాలు కొనసాగితే ప్రజల ప్రశాంతతకు భంగం కలగడమే కాకుండా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.బెల్ట్ షాప్ ల నియంత్రణ కీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిఘా ఏదీ ఇన్ని సమస్యలు, ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్, పోలీసు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైన్స్ షాప్ దూర నిబంధనలు, పర్మిట్ రూముల అనుమతులు, బెల్ట్ షాపుల నిర్వహణ, మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, బస్టాప్ పరిసరాల్లో మహిళలు, విద్యార్థులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక ప్రజల ఇబ్బందులు ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.