కుల్కచర్ల, మేజర్ న్యూస్:నేరాల నివారణకు ప్రజల సహకారం అవసరమని సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని బండవెల్కిచర్లలో సిసి కెమెరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని తెలిపారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనయ్య, పాంబండ ఆలయ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.