telangana
నెన్నెల మండల కేంద్రంలో ఘనంగా బాలల దినోత్సవం
సూర్య నన్నెల :మండల కేంద్రంలో శనివారం గ్రామపంచాయతీ కార్యక్రమంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఎండి ఇబ్రహీం అధ్యక్షతన ప్రత్యేక బాల గ్రామసభను నిర్వహించారు. సభలో బాలల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, హక్కులు, మౌలిక సదుపాయాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పంచాయతీ ప్రత్యేక అధికారి ఏంపివో వేదాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలోని ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లాలని, మధ్యలో చదువు మానేయకుండా విద్యను కొనసాగించాలని, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం వంటి సమస్యలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, బాలవిహార్ కార్యక్రమాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరాడు. పిల్లలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని వాటి పరిష్కారానికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సర్పంచ్ ఎండి ఇబ్రహీం హామీ ఇచ్చారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, చిన్నారులకు పెన్నులు మరియు స్వీట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు చంద్రశేఖర్, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది, విద్యార్థులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.