నామాపూర్‌లో జిల్లాలోనే తొలి ఐకేపీ కేంద్రం ప్రారంభం
సూర్య,ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తొలి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో గ్రామ సర్పంచ్ మాదాసు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర అందిస్తుందని, దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని తెలిపారు. కేంద్రంలో తూకం, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూస్తామని సర్పంచ్ మాదాసు అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, గ్రామ పాలకవర్గ సభ్యులు, ఐకేపీ సిబ్బంది, నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.