నాలుగు రోజుల పాదయాత్రకు ప్రజల ఆదరణే కొండంత బలం – ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటానికి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన నాలుగు రోజుల పాదయాత్ర నూతన ఉత్సాహాన్ని నింపిందని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘనస్వాగతం పలకడం ఉద్యమానికి ప్రజాబలాన్ని చాటిందని పేర్కొన్నారు. ప్రజల ఆదరణే పాదయాత్ర విజయానికి కొండంత బలమని, ఇందుకు సహకరించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గత 20 ఏళ్లుగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం జేఏసీ, బీజేపీ నిరంతరం పోరాటం చేస్తున్నాయని, ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రతో సమస్య పరిష్కారంపై ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని అన్నారు. నాలుగు రోజుల పాటు సాగిన పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారని, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందని తెలిపారు.జవహర్‌నగర్‌తో పాటు దమ్మాయిగూడ, కార్మికనగర్, నాగారం ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధుల చికిత్స కోసం తమ సంపాదనలో అధిక భాగాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్ తరలింపునకు ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి తగిన చొరవ చూపలేదని విమర్శించారు. ఈటల రాజేందర్ పాదయాత్రతో ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై సమస్య పరిష్కారానికి ఒత్తిడి పెరిగిందని అన్నారు. డంపింగ్ యార్డ్ తరలించి బాధిత ప్రాంతాల ప్రజలకు శాశ్వత న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని ఏనుగు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.