నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ ప్రమాద బీమా!
హుస్నాబాద్ : ఒకప్పుడు రైతు బీమా పొందాలంటే భూమి ఉండాలనే నిబంధన ఉండేది. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రమాదవశాత్తు ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే పరిస్థితులు పరిమితంగా ఉండేవి. కానీ నేడు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రమాద బీమా పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, రోజువారీ జీవనం భారంగా మారి ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడుతుంది. అలాంటి క్లిష్ట సమయంలో ఇందిరమ్మ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నిరుపేదలకు కొండంత ధైర్యాన్ని ఇస్తోంది.భూమి ఉన్నవారికే భరోసా అనే పరిస్థితి నుంచి భూమి లేని పేద కుటుంబాలకూ భద్రత కల్పించే దిశగా ఈ పథకం ముందడుగుగా నిలుస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవించే కార్మికులు, నిరుపేదలు, అసంఘటిత రంగ కార్మికుల కుటుంబాలకు ఇటువంటి బీమా పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంటున్నారు.కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ప్రభుత్వం అందించే బీమా సాయం ఆ కుటుంబానికి ఆపద సమయంలో అండగా నిలవడమే కాకుండా పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.నాడు భూమి ఉంటేనే బీమా.. నేడు భూమి లేకుండా బీమా భరోసా!అనే భావనతో నిరుపేద కుటుంబాల్లో ఆశల చిగురిస్తున్నాయి అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పథకం యొక్క ప్రయోజనాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు . ఆపదలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే అంతకంటే గొప్ప భరోసా మరొకటి లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు