మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు
కొల్చారం …మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి బ్రిడ్జి సమీపంలో మంజీరా నదిలో మంగళవారం గల్లంతైన తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బుధవారం కొల్చారం పోలీసులు వెలికితీశారు. తల్లి, ఇద్దరు కుమార్తెలు విగతజీవులుగా కనిపించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆర్థిక ఇబ్బందులతో అఘాయిత్యానికి పాల్పడ్డారా?
బంధువుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగోల్ల సరిత (27)కు వైష్ణవి (7), సాన్విక (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, పిల్లలను తనకు దూరంగా ఉంచాల్సిన పరిస్థితుల కారణంగా సరిత మనస్తాపానికి గురైనట్లు బంధువులు తెలిపారు. అయితే ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు మృతదేహాలను వెలికితీసి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.