మంచిర్యాలలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి: డీసీపీ ఎ.భాస్కర్
సూర్య మంచిర్యాల టౌన్ : రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడి ప్రాణదాతలుగా నిలవాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పిలుపునిచ్చారు.పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రజల హక్కులు, ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రోడ్డు ప్రమాదాలు,అత్యవసర వైద్య పరిస్థితులు,శస్త్రచికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరమని, ఒకరు చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని పేర్కొన్నారు.ఈ శిబిరంలో పోలీసు సిబ్బందితో పాటు యువత,ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.రక్తదాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.శిబిరం విజయవంతానికి కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ జై భాస్కర్ రెడ్డి, సీహెచ్ మహేందర్ తదితరులకు డీసీపీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఎస్ఐలు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జై భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ మహేందర్, సీనియర్ సభ్యుడు వి.మధుసూదన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఏవీ రావు, లయన్ డాక్టర్ కే.సుగుణాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.