మేడ్చల్ వెస్లీ చర్చిలో ఘనంగా పంట పండుగ వేడుకలు
మేడ్చల్, మేజర్ న్యూస్: మేడ్చల్ ఎన్జీఓస్ కాలనీలోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో వార్షిక కృతజ్ఞతా పంట పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ పాస్టరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవునికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ చర్చి మాజీ బిషప్ రెవరెండ్ టి.ఎస్. కనక ప్రసాద్ దైవ సందేశాన్ని అందించారు. ప్రతి పంట దేవుడు ప్రసాదించిన వరమని, జీవితంలో లభించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన సూచించారు. దేవుని ఆశీస్సులతో పొందిన సంపదను, సంతోషాలను ఇతరులతో పంచుకుంటూ ప్రేమ, సేవాభావంతో జీవించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రెస్బైటర్ ఇన్‌చార్జ్ రెవరెండ్ ఎం. జోసెఫ్ కిషోర్, శ్రీమతి శ్రీలత కిషోర్ నాయకత్వంలో జరిగిన ఈ వేడుకల్లో చర్చి కమిటీ సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు, యువజన సభ్యులు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. కృతజ్ఞతాభావం, భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక ఆనందోత్సాహాల మధ్య పంట పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి.